మహబూబ్‌నగర్ టౌన్, వెలుగు: సామ్రాజ్యవాద అమెరికా అనేక దేశాలపై యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని, దీనికి వ్యతిరేకంగా ప్రజాతంత్రవాదులు, వామపక్ష శక్తులు ఐక్యంగా పోరాడాలని సీపీఎం స్టేట్ సెక్రటరీ జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్నగర్లో సీపీఎం ఉమ్మడి జిల్లా విస్తృత సమావేశం కిల్లే గోపాల్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ఇరాన్–అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నదన్నారు. అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, దాన్ని పూడ్చుకునేందుకు ఇతర దేశాలపై సుంకాలు పెంచడం, దేశాల మధ్య తగాదాలు సృష్టించడం చేస్తున్నదని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, ఆర్.వెంకట్‌రాములు, శ్రీరాంనాయక్, ధర్మానాయక్, సీపీఎం జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.
